దుఃఖాగ్రహ రాగాలాపన

తల వెనుక రెండు చేతులతో నడిచే
ఆ తల్లుల మంద్ర రాగాలాపనల
దుఃఖ కెరటాల సముద్రాలు ప్రవహిస్తాయి
ఎండిన నెత్తుటి నేలల మీదుగా
కనురెప్పల మైదానాలపై కాలిన సతతారణ్యాలను
కూలిన స్థూపాల ధూళి నుండి ఎగసి
రాలి, నేలలో కలిసిన అద్భుత కలలను
అనేకానేక ఉద్దాన, పతనాలను
గాలి లిఖిస్తుంది రేపటికై
కాలచక్రాలను మీటుతూ ఆలపిస్తాయి క్షణాలు
ఎగుడు దిగుడుల తడబడు అడుగులతో
నడిచిన మానవ జాతి సుదీర్ఘ చరిత్రను
లిఖిత, అలిఖిత దుఃఖ,యుద్ధ గానాలను
చెదరని జ్ఞాపకాలను, ద్రోహాలను
అకాల మరణాలను, హింసాత్మక హనలాల్ని
మరపురాని అపూర్వ మానవులను
ఈ లోకం తప్పక గుర్తుంచుకుంటుంది
యుగాలుగా మనుషుల హృదయాల
నిండా నిండిన గాయాలను, వేదనలను
అది తన హృదయ స్పందన చేసుకుంది
వేటిని, వేటినీ అది మరువలేదు ఎన్నడూ
అనేకానేక దుఃఖభాజిత మరణాంతరాల
అనంతరపు జీవితానికంటిన
చేదు ఎన్నడూ వదలలేదు
బాధిత మానవులు దిగమింగిన
ఆ చేదు విడువలేదు
ఇంకా ఎవరూ ఈ లోకం
నుండి చేదును పోగొట్టలేదు
అవును అది గుర్తుంచుకుంటుంది దయగా
శోక సముద్రాల ఎగసిన కన్నీటి అలలను
పరాజితుల చరిత్రను, ధిక్కారాల్ని
సామాన్యుల సాహసోపేత త్యాగాలను
ఒక్కొక్కటి, ప్రతి ఒక్కటి..
విడువని దుఖపు చేదును
సరిగ్గా ఇలానో, మరోలానో
ఇప్పుడో, మరొక్కప్పుడో
సరికొత్త ఆవిష్కారాలకై అవి అన్నీ,
అన్నీ శుసుప్త కాలమై
అట్లా అంతటా పరివ్యాప్తమై,
నిద్రాణమై వేచివుంటాయి
దుఃఖం తొలగని, ఏ శాంతీ దొరకని లోకం
గుర్తుకుంటుంది.. తర్పణం వదలక
జరిగినవన్నీ, మళ్ళీ, మళ్ళీ.. నిజం సుమీ..
తప్పక అన్నింటినీ అది గుర్తించుకు తీరుతుంది
- విమల
Tags
-
Home
-
Menu
