విషాదం

చాలాసార్లు ఇతరుల సంతోషం చల్లార్చావు
ఉత్సవ సమయాల్లో పసివాడిలా ఏడ్చి
చాలాసార్లు వాళ్ళని కాంతివంతం చేసావు
ఉత్సవ సమయాల్లో పసివాడిలా నవ్వి
ఏడుపూ, నవ్వూ తేలికగా చూడగలరు
లోపలి పసిదనం ఎవరు చూస్తారని వెదికావు
నువు ఒంటరివని అనుకోలేవు కానీ
వారికి ఒంటరితనం భయమంటావు
నిజంగా లోకం లేదు
వేల కాంతివత్సరాలకి వికసించినట్లు
కనిపించే సృష్టి ఉత్త గాలిబుడగ
మెలకువతో చిట్లిపోయే కల అని
ఎవరో చెప్పగా విన్నావు
నమ్మావు, కలగన్నావు కానీ
ఈ బుడగ చాలా ఇష్టం
బుడగ చిట్లిన ఖాళీ భయం
ఉత్త పసివాడి చేష్ట మినహా
గోడకి రెండువైపులా ఒకేసారి ఉండబోయే
నీ అలజడికి అర్థమేమైనా ఉందా
ఇదంతా అందమైనదో, కాదో తెలీదు
ఇదంతా ఉన్నదనో, లేనిదనో
నీకు తెలుసో, లేదో తెలీదు
ఖాళీ ఆకాశంలో ఈదే గాలిలా
ఖాళీ ఆత్మలో ఊహిస్తావు లోకాన్ని
దీనికి ముగింపు తెలీదు
ఇతరుల్ని ఎక్కువ ప్రేమించావు
వాళ్ళు ఉండాలని, ఉన్నారని, ఉంటారని
తెలియని లోతుల్లో తలపోశావు
దుఃఖపు తేనెపట్టు పిండి
జీవితం చప్పరించాలని చూసావు
ఇతరులు లేరనేంత ప్రేమ
నీపై నీకు లేకపోవటమూ
ఇతరులు నువ్వే అనేంత ప్రేమ
వారిపై లేకపోవటమూ కదా
జీవితం లోతుల్లోని బలమైన విషాదం
- బివివి ప్రసాద్
Tags
-
Home
-
Menu
