అరవయ్యేళ్ళ క్రితపు స్త్రీల అస్తిత్వ వేదనలు శివరాజు సుబ్బలక్ష్మి కథలు

1925 సెప్టెంబర్ 25న పుట్టిన శివరాజు సుబ్బలక్ష్మి శతజయంతి సంవత్సరం 2025. స్వాతంత్య్రానంతర తొలి తెలుగు కథా నవలా రచయిత్రులలో ఆమె ఒకరు. వాళ్ళవలె కుటుంబమే ఆమెకు కూడా కథా స్థలం. కుటుంబంలో స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు, పరిష్కరించుకొనే తీరు ఆమె సాహిత్య వస్తువు. అయినా వాళ్ళ కన్నా భిన్నంగా స్త్రీల అస్తిత్వ సంవేదనను, ఆంతరక ప్రపంచ కల్లోలాన్ని ప్రదర్శనకు పెట్టటం శివరాజు సుబ్బల ప్రత్యేకత. సంస్కృత తెలుగు కావ్యాలు చదివిన సంస్కారం, మెట్రిక్ వరకు చదివిన ఆంగ్ల విద్యా పరిజ్ఞానం, హార్మోనియం, వయోలిన్ వాయిద్యాలతోటి సంగీత జ్ఞాన సంపద సమకూరిన పన్నెండు ఏళ్ళ వయసులో 1937 డిసెంబర్ 23న ద్రోణంరాజు వారి ఇంటిబిడ్డ సుబ్బలక్ష్మి, శివరాజు వెంకట బుచ్చి సుబ్బారావు భార్య అయింది. బుచ్చిబాబు కలం పేరుతో ఆయన అప్పటికే కథా రచయితగా నిలదొక్కుకొంటున్నాడు. 1942లో ఉద్యోగరీత్యా అనంతపురం చేరాడు. అక్కడినుండి 1967లో ఆయన మరణించే వరకు పాతికేళ్ల సంసార జీవితంలో సుబ్బలక్ష్మి రచనలు ప్రారంభమైంది చివరి దశకంలోనే. ఆమె తొలి కథ కాపురం ఆంధ్రపత్రిక 1960 మార్చి 16 సంచికలో ప్రచురించబడింది.
1942 నుండి 1960 వరకు ఆ పద్దెనిమిదేళ్ల కాలంలో బుచ్చిబాబు చివరకు మిగిలేది నవల వ్రాసి ఆధునిక తెలుగు నవలా సాహిత్యంలో సంచలనం సృష్టించాడు. కథా రచన కొనసాగించాడు. నాటక రచయితగా, ప్రయోక్తగా పేరెన్నికకన్నాడు. కవి, సాహిత్య విమర్శకుడు అయినాడు. షేక్‌స్పియర్ సాహితీ పరామర్శకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందాడు. ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. అదే కాలంలో సుబ్బలక్ష్మి బుచ్చిబాబు అవసరాలు, అభిరుచులు కనిపెట్టి వాటిని తనవిగా చేసుకొని ప్రవర్తించటం అభ్యాసం చేసింది. ఆయన కోసం ఇంటికి వచ్చిపోయే వారికి వండిపెట్టి ఆతిధ్యమిచ్చి ఆదరించి ఉత్తమ ఇల్లాలు అయింది .సాహిత్య ప్రపంచంలో ఆయన అభివృద్ధికి, విజయాలకు వెన్నుదన్ను అయింది. మొత్తం మీద ‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది’ అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం అయింది శివరాజుసుబ్బలక్ష్మి.
అయితే ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉండటం కాదు, ఒక స్త్రీ తనను తాను కోల్పోవటం ఉంటుంది అని స్త్రీవాదం ఇచ్చిన పొడిగింపు దృష్ట్యా చూసినప్పుడు శివరాజు, సుబ్బలక్ష్మి బుచ్చిబాబు అభివృద్ధి నీడలో తనను తాను కోల్పోయింది అనుకోవాలా? అంటే కాదు అని ఆమె సాహిత్య సృజన కృషి, చిత్రకళా నైపుణ్యం చెబుతాయి.అదెలా సాధ్యమైంది? అంటే బుచ్చిబాబు కోసం వచ్చిపోయే వాళ్లకు అతిథి మర్యాదలు చేసి తెరచాటుకు తప్పుకొనటం కాక, డ్రాయింగ్ రూమ్‌లో కూర్చుని వాళ్ళ సంభాషణాలలో, చర్చలలో భాగం కావటం వలన. ఆయన చదివిన కొత్త పుటల సారాంశం అనుభవిస్తూ చెబితే ఆర్ద్రతతో విన్న అనుభవం వల్ల, బుచ్చిబాబుకు తెలిసినవన్నీ తనకు తెలియాలన్న పంతం ఎలా కలిగిందో కానీ అదే ఆమెను రచయితను చేసింది. (పగిలిన హృదయం రక్తాన్ని చిమ్మలేదు’ 5.-7.1968, ఆంధ్రజ్యోతి) పన్నెండు, పదమూడు ఏళ్ళ వయసులో ఆమె బుద్ధిలో, మనసులో వేరూనుకొన్న సాహిత్య సంగీత ఆంగ్ల విద్యా భిరుచులను ఆ రకంగా ఈ పద్దెనిమిది ఏళ్ల కాలమూ పదిలపరచుకొంటూ, పరిపోషించుకొంటూ వచ్చినదన్నమాట. కనుకనే ఆమె 1960లో రచయితగా తనను తాను ఆవిష్కరించుకొనటం సాధ్యమైంది. దాదా పు ఆ కాలంలోనే చిత్రకళాభ్యాసమూ ప్రారంభించింది.
శివరాజు సుబ్బలక్ష్మి ముప్ఫయ్యారు (36) కథలు, రెండు (2) స్మృతి కథనాలు, మూడు(3) నవలలు ఒక(1) జ్ఞాపకాల కథనం వ్రాసింది. మొదటి కథ కాపురం ప్రచురించబడి పక్షం తిరగకుండానే జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి మెప్పును అందుకొంది. మనుషుల మధ్య సంబంధాలు ఎంత సామరస్య పూర్వకంగా, సంస్కారవంతంగా ఉండా లో చూపించే సరళమైన కథ అన్నాడాయన దానిని. అయి తే మనుషులమధ్య సామరస్యం ఆదర్శమే కానీ వాస్తవజీవితంలో అందుకు ఆర్థిక, అధికార, లైంగిక సంబంధాల వంటివి ఎన్నో అవరోధంగా ఉంటాయి. అవి సృష్టించే సంక్లిష్ట సందర్భాలలో సామరస్యం కుదుర్చుకొనే బాధ్యతల ఒత్తిడికి గురయ్యేవాళ్ళు స్త్రీలే. స్త్రీల అనుభవ కోణాన్ని కేంద్రంగా చేసి సుబ్బలక్ష్మి వ్రాసిన కుటుంబకథలు భిన్న కోణాల నుండి దానినే నిరూపించాయి.
‘మరుగుపడిన ఆత్మీయత’ ‘ముంజేతికంకణం’ వంటి కథలలో ఆర్థిక వనరుల లేమి, లేదా వాటి మీద ఆశ తల్లీబిడ్డల, అన్నాచెల్లెళ్ల సంబంధాలలో సామరస్యాన్ని ఎలా మాయం చేస్తాయో చూపిన సుబ్బలక్ష్మి పితృస్వామిక కుటుంబం మగవాళ్లకు భార్యల మీద, మగపిల్లల తల్లులకు కోడళ్ళ మీద ఇచ్చిన అధికారం, మొత్తంగా మానవ సంబంధాలలో పరాధీనత ఆలంబన అనే ద్వంద్వాల మధ్య వైరుధ్యంలో అమలయ్యే అధికారం మనుషుల మధ్య సామరస్యాన్ని దెబ్బతీస్తున్న తీరును ‘కథలు చెప్పే గౌరీ’, ‘నేనూ అంతేనేమో’ వంటి కథలలో చిత్రించింది.
మరీ ముఖ్యంగా భార్యాభర్తల సంబంధాలలో స్త్రీలు అనుభవించే ప్రేమరాహిత్యం ఆమె కథలకు తరచూ వస్తువైంది. భార్యతో కాపురం, రోజువారీ జీవితం అనుభూతులు, ఆర్ద్రతలు మిగుల్చుకోని ఒక అలవాటుగా మారటం స్త్రీల జీవితంలో కనబడని గాయాన్ని చేసి సలుపుతుండే తీరు, దాని పరిణామాలు ‘మనసు తెచ్చిన మార్పు’, ప్రయాణం తిరుగుతోంది, మనసుని ముసిరిన మబ్బులు వంటి కథలలో చిత్రించబడింది. ఇంట్లో పశువుల పట్ల చూపే శ్రద్ధ కూడా భార్యపట్ల చూపలేని వాళ్ళు, ఏదో ఉంటున్నావు కనక ఉండు అన్నట్లుగా నిర్లిప్త సంసారాలు ఏళ్లకు ఏళ్ళు చేస్తున్న వాళ్ళు, భార్యల ఆశలు, ఆకాంక్షలు పట్టించుకోకుండా పోయే వాళ్ళు ఈ కథలలో కనబడతారు. తమ ఉనికికి, కదలికకు, అందానికి, ఆంతర్యాన్ని ఇసుమంత గుర్తింపు కూడా ఇయ్యని భర్తల తోటి అసంతృప్త జీవితంలో స్త్రీలు పరపురుషులకు ఆకర్షితులయ్యే అవకాశాలు కూడా ఉంటాయని ప్రయాణం తిరుగుతోంది వంటి కథలలో సూచించారు ఆమె.
స్త్రీల అసంతృప్త అశాంత జీవితాలకు భర్తలకు కుటుంబం బయట స్త్రీలతో ఉండే సంబంధాలు కారణంగా చూపిస్తాయి సుబ్బలక్ష్మి గారి చాలా కథలు. భార్యలుగా అవి వాళ్లకు అవమానకరమైనవి. దుఃఖ కారకమైనవి. అడిగి గెలవలేక, వదిలివెళ్లలేక పడే మానసిక యాతన ‘మట్టిగోడలు మధ్య గడ్డి పోచలు’ పోస్టు చెయ్యని ఉత్తరం వంటి కథలలో స్త్రీలను ఆత్మహత్యల వైపునకు నెడితే, వికసించని ఆత్మీయులు, ‘మనసుని ముసిరిన మబ్బులు’ వంటి కథలలో ఇల్లు వదిలి వెళ్ళమని తొందరపెడతాయి. బయటి ప్రపంచంలో మగవాళ్ల ప్రవృత్తులను చూశాక భర్తలే నయమనుకొని స్త్రీలు సమాధానపడిన మనసుతో ఇళ్లకు వెళతారు. మంచీ, చెడూ వంటి కథలలో అలాంటి భర్త కోసం తనకు తానే స్వయం శిక్షణతో వేసుకొన్న సంకెళ్లతో స్త్రీలు పడే ఒంటరి వేదన కనబడుతుంది. మాటలతో, నగలతో, చీరెలతో, ఆస్తులతో తనే జీవితంగా జీవిస్తున్నట్లు కనబడే భర్తల గురించిన హెచ్చరికతో సుబ్బలక్ష్మి వ్రాసిన ‘ముక్తీ - విముక్తి’ కథ ప్రత్యేకం చెప్పుకోవలసింది.
భర్తలు ఎటువంటివాళ్లయినా సర్దుకుపోయి సామరస్యాన్ని కుదుర్చుకొని బతికెయ్యమని స్త్రీలకు సూచించినప్పటికీ మొత్తంమీద సుబ్బలక్ష్మి కథలు పవిత్ర దాంపత్య సంబంధాల మేడిపండు స్వభావాన్ని, కుటుంబ సంబంధాలలోని బోలుతనాన్ని బట్టబయలు చేశాయన్నది వాస్త వం. రోగ నిర్ధారణ దశకు సంబంధించిన కథలు ఇవి. రోగకారణాలు నిగ్గుతేల్చి శస్త్ర చికిత్స చేసైనా సరే పెళ్లి, దాంపత్యం, కుటుంబం అనే వ్యవస్థలను ప్రజాస్వామికీకరించే ప్రక్రియ గురించి అన్వేషించే దిశగా కథను పదునెక్కిస్తున్న వర్తమానం నుండి ఆ గతంతో సంభాషణ అవసరం. ప్రయోజనకరం.
-కాత్యాయనీ విద్మహే
Tags
-
Home
-
Menu
