కనబడని నవ్వు

కనబడని నవ్వు
X

నిశ్శబ్దాల నివురుకప్పుకుందో

మౌనాల మబ్బు తునకల్లో మునిగిపోయిందో

వెన్నెల స్వరంలా పైరు మీది పరిమళంలా

వినిపించాల్సిన నవ్వు వినబడకుండా పోయిందేమిటో

రెప్పల చూరు కింద తడిసి ముద్దై పోయిందో

ఒంటరితనాల ముసురులో

విసిగివేసారి పోయిందో

యుక్త వయస్సు పిల్ల వాని ఈలలా

తొలి చూలు బిడ్డప్పుడు

అమ్మ పాడిన లాలి సవ్వడుల నవ్వు

ఇప్పడెందుకో సప్పడుసేయకుంది

వేదనా గాలుల్లో చిక్కుకుపోయిందో

ఏ సంఘర్షణ చట్రంలో ఇరుక్కుపోయిందో,

చినుకుల తడికి మొలకెత్తిన

మట్టి వాసనలా ప్రకృతి ఒడిలో

పల్లవించే పక్షి గీతంలా

సందడి చేయాల్సిన నవ్వు

ఇప్పుడెందుకో వినపడటం లేదు

- యు.ఎల్.ఎన్.సింహా

Tags

Next Story