నేను మీ కవి యాకూబ్‌ను.. నేను నా సాహితీ యాత్ర

మా నాన్న మహమ్మద్ మియా- చింతపండు, మిరపకాయలు తలమీద పెట్టుకుని ఊరూరూ అమ్ముకుంటూ ఖమ్మం జిల్లా కారేపల్లి వచ్చాడు. ఆ తర్వాత చిన్నప్పటి నుండి తెలిసిన తాపీ పని చేసిండు మా నాయిన కారేపల్లిలో. ఆ తరువాత పక్కనే ఉన్న కోయవాళ్ళ ‘రొట్టమాకురేవు’ అనే చిన్న పల్లెటూరు చేరిండు. అక్కడ ఉంటూ పక్కన ఉన్న ఊళ్లు తిరిగి కావిడిలో తినే దినుసులు, బెల్లం, ఉప్పు, పప్పు, పువ్వాకు, చిల్లర సరుకులు అమ్మేవాడు. ఆ తర్వాత చిన్నచిన్నగా ఎగసాయం మొదలుపెట్టిండు కౌలుకు తీసుకుని. చదువుకున్న పూర్వీకులు ఎవరూ లేరు. అంతా జీతగాళ్లే. దాశరథి పుట్టిన ఊరు వరంగల్ జిల్లా చినగూడూరు మా నాన్న పుట్టిన ఊరు.
బాల్యం కనాకష్టం. అతి సాధారణమైన, కడుపేద బాల్యం. ఆయమన్న తిండి, ఆయమన్న గుడ్డలు లేని బాల్యం. చదువు ఎట్లాగో జీవితంలోకి ప్రవేశించింది. అది కూడా పంతుళ్ళ దయతో, దోస్తుల సహకారంతో సాగింది. కొత్త పలక, కొత్త పుస్తకాలు కొనుక్కోలేని చదువు. ఎవరో పాత పుస్తకాలు దానం చేసేవాళ్ళు. ఎవరో నోటు పుస్తకాలు ఇచ్చేవాళ్ళు. పేద పిల్లలకు ఇచ్చే పుస్తకాలు స్కూళ్లకు వస్తే, అవి నాక్కూడా చేరేవి. చదువు ఒంటపట్టినందు వల్ల బతుకు ఒక గాడిలో పడిందేమో. చదువు అన్ని కష్టాలనుంచి దారి చూపిస్తుందని ఆశ పడ్డానేమో. పదో తరగతి పాసైనంక చదువే ఇక దారి అని నమ్మకం కుదిరింది. ఊరునుంచి కాలు బయటపెట్టాను. ఇంటర్ కోసం కొత్తగూడెంలో అడుగుపెట్టాను. అదే విశాలమైన లోకంలోకి పెట్టిన తొలి అడుగు.
మొదటి కవిత ప్రజాశక్తిలో ‘నేను’ పేరుతో 1983 అచ్చయింది. అంతకుమునుపు పాటలు రాసాను- పాటలు పాడాను. కంజీర కొట్టుకుంటూ ఎన్నెన్ని ఊళ్ళు తిరిగి పాటలు పాడుకుంటూ విద్యార్థి సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నానో లెక్కచెప్పలేను. 1980 ప్రాంతాల్లో ఇంటర్ ఫెయిలై కొత్తగూడెం సింగరేణి కాలరీస్ యూనియన్ ఆఫీసు బాయ్ గా, పేపర్ బాయ్ గా ఉన్నప్పుడు, గోదావరిఖనిలో ఐస్ క్రీమ్ అమ్ముతున్నపుడు బతుకును అతి దగ్గరగా గమనించాను. కవిత్వం రాయడం వైపుకు మళ్లింది డిగ్రీ కాలంలోనే. కారణం అఫ్సర్, ప్రసేన్, సీతారాంల సాంగత్యం. తర్వాత వంశీకృష్ణ జతయ్యాడు. పాటలు రాయడం, పాడటం, విద్యార్థి ఉద్యమాల నుంచి కవిత్వం వైపుకి వచ్చాను. ఒక ఔట్‌లెట్ వెదుక్కోవడం, నన్ను నేను వ్యక్తీకరించుకోవడంకోసం కవిత్వం దరిచేరాను. పల్లె నుంచి పట్నం వైపుకు ప్రయాణిస్తున్నప్పుడు నన్ను అతలాకుతలం చేస్తున్న భయం, అభద్రత, నిస్పృహల నుండి కవిత్వం కాపాడింది. తొలి కవితల్లో, ప్రవహించే జ్ఞాపకం సంపుటిలో ఈ తొట్రుపాటు భావన స్పష్టంగానే కనపడుతుంది. కవిత్వం సాధించదగిన అంశాలలో నేను విశ్వసించేది మానవీయత. దానిని మనుషుల్లో పాదుకొల్పేందుకు కవిత్వం మంచి ఉపకరణం అని నా విశ్వాసం.
డిగ్రీ చదువు దుర్గమ్మ గారి, కె.ఎల్.గారి సౌజన్యం. ఆ సౌజన్యమే లేకపోయుంటే నా జీవితమేమై ఉండేదో ఊహించడం కష్టం. నా జీవన సహచరి శిలాలోలిత, కవయిత్రి. పరిశోధకురాలు. నా సహాధ్యాయి. అసలు పేరు పురిటిపాటి లక్ష్మి. నా జీవితంలోకి ఆమె ప్రవేశం నన్నో సుస్థిరగమ్యం వైపునకు నడిపించిందనే కృతజ్ఞత నాకు ఆమెపై ఉంది. సాహిత్య జీవితానికి బాసటగా, ఆటుపోటుల జీవితానికి ఆమె తెరచాపగా నిలబడింది. కవిత్వాన్ని మునుపటికంటే విస్తృతంగా ప్రజలకు చేరువచేయడంలో కృషి కొంత చేసాననిపిస్తోంది. నేను 2012లో సోషల్ మీడియాలో ఆరంభించిన ‘కవి సంగమం’ నాకు గర్వకారణం. ఇవాళ 18,000 మందికి పైగా కవిత్వ ప్రేమికులు అందులో ఉన్నారు. అప్పుడే కలం పట్టిన వాళ్లకు నేనో యారోమార్కులా వారి మార్గంలో నిలబడ్డాను. ఆత్మీయ నేస్తంలా మారాను. ఆకలి దప్పుల ప్రయాణంలో ఆసరాగా సాధ్యమైనంత మేరకు ఉండగలిగాను. నిరంతరంగా మూడు తరాల కవి సంగమం, రెండు తరాల కవిసంగమం, ఊరూరా కవి సంగమం కార్యక్రమాలు, పోయెట్రీ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ కొత్త కవులకు దారులు నిర్మిస్తున్నాను. మా ఊరు రొట్టమాకురేవులో ప్రారంభించిన గ్రంథాలయం Give back to the society భావనలో భాగం.
లౌకిక ప్రజాస్వామిక వేదికల నిర్మాణంలో పాలుపంచుకున్నాను. 2002 గుజరాత్ మారణ హోమం తర్వాత నేను కన్వీనర్‌గా ఉన్న ఒక టీమ్ గుజరాత్‌కు వెళ్లి వచ్చాక, ఇక్కడ విస్తృతంగా సభలు చేయడంలో, పుస్తకాలు వేసి ప్రచారం చేయడంలో ముందున్నాను. ఇప్పటి ‘సమూహ’ వేదిక కన్వీనర్‌గా భిన్నత్వంలో ఏకత్వపు భావనను నిలపడం అనే దృక్పథంతో పనిచేస్తున్నాను. లౌకిక స్వప్నం గురించే మాట్లాడడం, అదే ఈ దేశపు అవసరమని అప్పుడూ, ఇప్పుడూ నమ్ముతున్నాను. ‘మొహబ్బత్ కా దుకాన్’ల అవసరం ఈ దేశానికి చాలా చాలా అవసరం. ‘ప్రవహించే జ్ఞాపకం’ నుండి ‘మనుషుల్రా మనుషులు’ కవితా సంపుటాల వరకు... సమాజ ప్రతిఫలనాల్ని నా జీవిత నేపథ్యపు అనుభవాలను మేళవించి కవిత్వం చేయడానికి ప్రయత్నించాను. నా కవిత్వంలోని ‘నేను’ నేను మాత్రమే కాదు, సమాజంలోని అనేక నేనులు. సంఘర్షణాత్మక జీవితానుభవపు సారాన్ని కవిత్వంగా మలిచాను. అంతర్లీనంగా భారతీయ ముస్లిం వేదనను వినిపించాను. సెక్యులరిజం అవసరాన్ని, ప్రాధాన్యతను కవిత్వంలో నిరంతరంగా రాస్తున్నాను. సరళంగా కవిత్వ వ్యక్తీకరణ ఉండాలని ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించాను. ‘నా కవిత్వమే నా ఆత్మకథ’ అని ఒకచోట రాసుకున్నాను.
అదే కవిత్వంలో ప్రతిఫలించే నిజం. ప్రవహించే జ్ఞాపకం నుండి వరుసగా సరిహద్దురేఖ, ఎడతెగని ప్రయాణం, నదీ మూలం లాంటి ఆ ఇల్లు, తీగల చింత, ‘మనుషుల్రా మనుషులు’ ఈ సంకలనాల పేర్లు నా కవిత్వ పరిణామపు సంకేతాలుగా అనుకుంటాను. వ్యక్తి, సమాజం, అంతశ్చేతన, సంఘర్షణ.. ఈ అంశాలు సూత్రప్రాయంగా ఈ పేర్లలో ధ్వనించడం గమనించవచ్చేమో!పరిశోధనలో తెలుగు సాహిత్య విమర్శ అంశంగా తీసుకుని ప్రత్యేకంగా కృషిచేసాను. నాలుగు పుస్తకాలు ప్రచురించాను. కవిత్వ సృజనగురించిన అనేక అంశాలతో ‘సృజనానుభవం’గా రాసాను. బీహార్, పాట్నా నుండి అందుకున్న ‘నయీ ధార నేషనల్ అవార్డు’ జాతీయ స్థాయిలో ప్రసిద్ధమైనది. దానితోపాటు తెలుగు నేలపై అందుకున్న ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, మఖ్దూమ్ అవార్డు, సి.నారాయణరెడ్డి అవార్డు, రావెళ్ల వెంకటరామారావు అవార్డు, ఆలూరి బైరాగి అవార్డు, ఎదిరెపల్లి మశమ్మ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు, ATA అమెరికా అవార్డు వంటివి ప్రముఖమైనవి.
ఐదేళ్లు కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు అడ్వైజరీ బోర్డు మెంబరుగా ఉన్నాను. 2019లో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపికయ్యాను. 2024 నుండి హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నాను. కవిత్వం కవిత్వంగా చూసే దృష్టికంటే అది సమాజంలోని మనిషిని మనిషిగా తీర్చిదిద్దే, రూపుదిద్దే ప్రక్రియగా ఉండాలని నా ఆకాంక్ష. అభిమతం. మనుషుల్ని హ్యాండిల్ విత్ కేర్ అన్నానందుకే. మనిషిని మనిషిగా చూడలేని సమాజం ఎంత ప్రగతి సాధించింది అని గొప్పలు చెప్పుకున్నా అది ప్రగతి కాదు. ప్రగతి అంటే మనుషులు మనుషులుగా మారడం. చూడబడటం. ప్రేమించబడటం. ఆత్మీయంగా ఆలింగనం చేసుకోగలగడం. దానికోసం కవిత్వం ఒక ఉపకరణంగా మారాలని నా తాపత్రయం. అదే నిజమైన మానవ వికాసం.
“నువ్వొక పచ్చని చెట్టయితే
పిట్టలు వాటంతటవే వచ్చి వాలేను!”
పచ్చని చెట్లలాంటి మనుషుల్ని కలగంటూ జయహోలు.
Tags
-
Home
-
Menu
