దిగులు బావి

అతడు బాధల తట్టను నెత్తిన ఎత్తుకొని
దినమంతా మట్టితో ముచ్చటిస్తాడు
సదా సమస్యల కొలిమిలో కాలిపోతూ
చెదిరిన కలల బూడిదను రాల్చుతుంటాడు
చెమట చుక్కలను అంగట్లో అమ్ముకుంటూ
బత్కు బండిని భారంగా లాగుతుంటాడు
ఒకే గర్భ గుడి మా ఇద్దరికి ఊపిరి పోసినా
అక్షరాలు నా బత్కుని పచ్చని పైరుని చేస్తే
తమ్ముని లైఫ్‌ని ఎండిన ఏటిగడ్డ జేసినయ్
తనని ఈడ్చికెల్లి నేను బడిలో ఇడ్శిపెట్టినా
లంగా సవాసాలు మోపుజేసుకొని ఊరేగి
గోవ కర్ర , తాళ్ళకు
తన తనువుని తాకట్టు పెట్టాడు
పేర్చుకున్న ఆశలన్నీ పెలుసులుగా రాలి
గాజు వక్కలై రోజూ నా గుండెకు
గుచ్చుకుంటూనే ఉన్నాయి
ఇప్పుడు నాన్న ఇచ్చిన వారసత్వపు తాపీ
తన ఎండిన పేగులకు ఎనగర్రై నిలబడ్తాంది
ఇప్పుడు రుతువులన్నీ తమ్ముని పెయ్యి మీదనే
పేరిణీ నృత్య మాడుతున్నాయి
తన జీవితంలోకి ఆమె వసంతమై వచ్చినా
తన బత్కు ఈసమంతైనా ఇగురు పడ్తలే
వాడి కడుపులో రెండు కాయలు కాసి,
తన మనసును ఇంకా దిగులు బావిలోకి నెట్టింది
తను కాసుల కత్తెరలో ఇరుక్కున్నప్పుడల్లా
నేను ఊత కర్రై ఊపిరి పోస్తూనే ఉన్నాను
తమ్ముడి బతుకు ఒక యుద్ధంలా మారింది
అతను అలసిపోని సైనికుడై
శ్రమ ఆయుధాన్ని తిప్పుతూనే ఉన్నాడు
కాలం చెబుతున్న పాఠాలను నేర్చుకుంటూ
సంసార సాగరాన్ని ఈదుతున్నాడు
అవమానాల గరళాన్ని కంఠంలోనే
దాచుకుంటూ మౌనమునిలా సాగుతున్నాడు
- తాటిపాముల రమేశ్ (తార)
Tags
-
Home
-
Menu
