నేడు రావాల్సిన రచనలు

మనిషి తన జీవిత కాలంలో చేసిన పనులు, అనుభవించిన సుఖదుఃఖాలు, గమనించిన విశేషాలు, తను వేసిన ప్రభావాలు, నేర్చుకున్న పాఠాలు, అందించిన ఆదర్శాలు, నమ్మిన ఆశయాలు, విలువలు, పొందిన ఫలితాలు, ఆశించి భంగపడిన సందర్భాలు, తనపై ప్రభావా ల్ని వేసిన సమయాలు, తను పోషించిన పౌర సం బంధాలు,కుటుంబ సంబంధాలు, మరి కొన్ని వి శేషాలను క్రోడీకరించి చెప్పే రచనల్ని జీవిత చరిత్రలు అంటారు. సమాజంపై పలు రకాలుగా ప్ర గాఢమైన ప్రభావాల్ని చూపిన వ్యక్తుల జీవితాల్ని ఇతరులు రాయడాన్ని జీవిత చరిత్ర రచన అం టారు. ఎవరైనా తన జీవిత చరిత్రను తానే రాసుకున్నట్లయితే అది స్వీయ చరిత్ర లేదా ఆత్మకథ అని అనవచ్చు. అంతరంగ కథ, అంతరాత్మకత లాంటి పేర్లు కూడా వీటికి వర్తిస్తాయి.
మొహమాటం, న్యూనత, నిరాసక్తత, రచనా శక్తి లేకపోవడం, సమయాభావం కల వ్యక్తులు తమ చరిత్రను తాము రాసుకోలేరు. వారి గురించి ఇతర రచయిత రాయాలి. రచయిత ఆసక్తులను బట్టి పూర్తి స్థాయి లేదా పాక్షిక జీవిత చరిత్రలు వె లువడతాయి. జయంతి, వర్ధంతి, స్మారక సంచికలు, షష్టిపూర్తి పదవీ విరమణ లేదా వివిధ సం దర్భాలలో వ్యక్తులు రాయించుకునే రచనలు పాక్షిక జీవిత చరిత్రలు. వీటిల్లో వ్యక్తికి చెందిన ముఖ్యమైన విషయం నమోదవుతుంది. పూర్తిస్థా యి జీవిత చరిత్రలో వ్యక్తి సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక ధోరణులు, భావజాలం కార్యాచరణ కనిపిస్తుంది.
సంఘజీవనం, సమకాలీన విషయాలు, సమాజ ప్రగతి, సాంఘిక దురాచారాలు, వ్యాపార వాణిజ్యాలు, ఆధునిక నాగరికతల ప్రభావాలు, మొ త్తంగా సామాజిక చలనాలు ఆ రచనలో రికార్డు అవుతాయి. సమర్థుడైన రచయిత రాసిన జీవిత చరిత్రలు సంఘ జీవన సాక్షాలుగా ఉంటాయి. ఉత్తే జ పూరితంగా ఉండి చదివింప చేస్తాయి. వ్యక్తి తన జీవిత గమనాన్ని రాసుకుంటే అది స్వీయ చరిత్ర లేదా ఆత్మకథ అవుతుంది.
వ్యక్తి నిష్టతో రాస్తే సొంత కథ అవుతుంది. సొంత కథను సంఘ నిష్టతో రాసినట్లయితే సామాజిక చరిత్ర నమోదవుతుంది. నిర్జన వారధి, (కొండపల్లి కోటేశ్వరమ్మ), సొంత కథ (రాం భట్ల కృష్ణమూర్తి), శతపత్రం(గడియారం రామకృష్ణ శర్మ) జీవన యానం(దాశరథి రంగాచార్య) యాత్రా స్మృతి(దాశరథి కృష్ణమాచార్య), 50 సంవత్సరాల జ్ఞాపకాలు (దేవులపల్లి రామానుజ రావు), హంపి నుంచి హరప్పా దాకా (తిరుమల రామచంద్ర), నాకథ(జాషువా), యాది(ఎస్. సదాశివ) లాంటివి ఇందుకు చక్కని ఉదాహరణలు. రచయితలకు చారిత్రక దృష్టి, సత్యనిష్ఠ, కళా దృష్టి ఉండాలి. ఆత్మకథ రాసుకునేవారు తన గురించి గొప్ప చెప్పుకునే అవకాశం ఉంది.
తన తప్పులను మరుగు పరిచే వీలు కూడా ఉంది. ఇలాంటి రచనలు అభాసు పాలవుతాయి. సామాజిక విలువలతో కూడిన రచనలో సమగ్రత కనబడుతుంది. అలాంటి రచనల వల్ల సాహిత్యం చారిత్రక వనరుగా వర్ధిల్లుతుంది. ఆత్మకథలు, జీవిత చరిత్రలు ,‘కట్టు కథలు‘ గా తే లిపోకూడదు జీవిత చరిత్ర రచయిత తన ప్రాపంచిక దృక్పథంతో ప్రముఖ వ్యక్తి జీవితాన్ని దర్శించడం కూడా ఆక్షేపణీయమే. ఆ వ్యక్తి ఆచరణను సంబంధాలను ఉన్నదున్నట్లుగా కళాత్మక దృష్టి తో ఆవిష్కరించాలి అందుకు సత్యనిష్ట నిబద్ధత అవసరము. అప్పుడే పారదర్శకత జీవిత చరిత్ర రచనలో చోటు చేసుకుంటుంది. ముఖ్యమైన విషయం వదలకుండా, సంక్షిప్తంగా రాయాలి.
పై వాక్యం జీవిత చరిత్ర స్వీయ చరిత్ర రచనలకు పునాది లాంటిది. జీవిత కాలంలో సమస్త విషయాలను అనుభవించి తెలుసుకోవడం అసంభ వం. ‘ఇతరుల అనుభవాల నుండి కావలసిన విష యం నేర్చుకోవాలి’. అనే నెహ్రూ వాక్యం శిరోధార్యం. సమకాలీనుల అనుభవాల్ని, గత కాలపు వ్యక్తుల జీవిత చరిత్రలను చదివి మన జీవితాలను మలచుకోవడం ఉత్తమం. ప్రామాణికమైన స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రలు భవిష్యత్ తరాలకు మేలు చేస్తాయి. కనుకనే అలాంటి రచనలు రావాలి. వాస్తవ చిత్రణతో కాలమాన పరిస్థితులను ప్రదర్శిస్తూ సరళ వచనములో సంఘటనలను వరుస క్రమంగా పొందుపరచిన రచన కళాఖండంగా భాసిస్తుంది.
భావాల వినిమయ వాహికగా భాష నిలుస్తుంది. ఏ రచనలోనైనా సంభాషణలు తప్పవు. పాత్రోచి త భాష వాడడం అనేది ఒక విధానం. రచనలోని వ్యక్తులు చదువుకోని వారైతే ఆ ప్రాంత భాషను వాడాలి. ప్రాంతోచిత భాష వల్ల రచనకు విశ్వసనీయత చేకూరుతుంది. భాష వ్యక్తి స్థాయిని తెలుపుతుంది. రచయిత శక్తి భాషా ప్రయోగంతో తెలుస్తుంది. భాషను తెలిసి వాడాలి. లేకుంటే తిప్పలు తప్పవు. నిష్పాక్షిక దృష్టి రచనకు రచయితకు మేలు చేస్తుంది. రచనను ఉన్నతీకరిస్తుంది. ఉద్యమ చరిత్ర సందర్భంలో కానీ, వ్యక్తి ఉన్నత ఆచరణ సమయంలో కానీ ,జీవిత చరిత్ర రచయిత సంయమనం పాటించాలి. లేకుంటే రచనయే కాదు, రాయబడుతున్న వ్యక్తి జీవితం కూడా అనుమానాస్పదంగా మారుతుంది.
కుండను ఎత్తుకొని తొంభై తొమ్మిది మెట్లు ఎక్కిన వ్యక్తి అలసి ఓపిక లేక 100వ మెట్టుపై పెట్టాల్సిన కుండను ఎత్తేశాడు. నీళ్లు నేలపాలయ్యాయి. క ష్టం నీళ్ల పాలయింది. దించాల్సిన చోట ఎత్తేస్తే ర చన కూడా అలాగే అవుతుంది. జీవిత చరిత్రలు, ఆత్మకథలు రాసే రచయితలకు అత్యంత ఓపిక అవసరం. నవలకున్నంత పెద్ద కాన్వాసు ఈ రచనలకు ఉంది. ఆ కాన్వాసుపై రచించే రచన అత్యంత ప్రభావం చూపుతుంది. అలాంటి రచన వల్ల సమాజానికి వెలుగు అందుతుంది. రచయితకు తృప్తి కలుగుతుంది. పాఠకుల దృష్టి వైశా ల్యం పెరుగుతుంది. ఇలాంటి బహుళ ప్రయోజన రచనలు నేడు రావాల్సిన అవసరం ఉంది.
బి.వి.ఎన్.స్వామి
Tags
-
Home
-
Menu
