కర్పూరం

కర్పూరం
X

బద్ధకించే మెదడుతో కవిత్వం చదివించటం, ఋజువర్తన, కోమలత్వం అనే దినుసులు లేని పద్యాన్ని పలవరించటం భాషకు వేసే శిక్ష లాంటిది. ఇక్కడ ఋజువర్తన అనే మాటను నేను బుద్ధి పూర్వకంగానే వాడాను. వస్తువు మీద నిగ్రహం లేని ఆధునికోత్తర జీవులు ఈ మాటను గరిక పూవులా విసురుతారని తెలుసు. కానీ మెదడుకు కాసింత పనిపెట్టి సారస్వత స్తంభాలని పిలుచుకొనే మన పురాకవుల వైపు ఒకసారి అడుగు జరిపితే వాళ్ళ రాతల్లో దొరికే ఋజువర్తన అనే దినుసు మీద మనసు లక్కలా అతుకుతుంది.

సహృదయత అనే ఒక్క అమరిక చాలు మామూలు మనుషులకు ఉత్త గుణింతాల గుంపులా తోచే కవిత్వం తరాలుదాటి ఎందుకు విస్తరించిందో తెలిసేందుకు. ఇప్పటి బడి పుస్తకాలు ఏయే పద్యాలను పిల్లలకందిస్తున్నాయో తెలీదు కానీ యథాలాపంగా ఇవాళ పుస్తకాల అరలో చేయుంచి లాగినప్పుడు గుప్పుమన్నాయి పచ్చ కర్పూరం బిళ్ళల్లాంటి వసుచరిత్ర పద్యాలు. ముందు వెనకలు వదిలి ఒక పుస్తకాన్ని చదివితే ఉండే ప్రయోజనాలేమిటో రాతల్లో చెప్పలేను కానీ, ఒక పూట కసరత్తు తర్వాత గుర్తొచ్చే పెసరట్టు రుచిలాంటి పద్యాలివి.

స్వైర విహార ధీరలగు సారసలోచనలున్న చోటికిన్

భోరున లాతివారు చొరబూనినచో రసభంగమంచు,నే

జేరక పువ్వు తీవెల చెంతనె నిల్చి లతాంగి రూపు క

న్నారగ జూచి వచ్చితి నవాంబు రుహాంబక నీకు దెల్పగన్!

స్థూలంగా దాని అర్థం ఇది-

ఒక మర్యాదస్తుడు సంగీతంలో నిమగ్నమైన ఆడాళ్ళను చూశా డు. వాళ్ళు సారసలోచనలు (తామర రేకులవంటి కళ్ళున్న వా ళ్ళు). తన ఉనికి తెలిస్తే రసభంగమౌతుందని పూల తీగల మధ్య నుండి ఆ యువతిని కళ్ళ నిండా చూసి వచ్చానని వసురాజుతో చెప్తాడు. కావ్యాల్లో కనిపించే ఋజువర్తన గురించి పుంఖాను పుంఖాలుగా చర్చించను కానీ అపరిచిత స్త్రీలకు దూరంగా తల వంచే భారతీయ సౌరభం పురా కవుల నాలుక మీద ఎంత స్పష్టంగా ఒలికిందో చెప్తుందీ పద్యం.

ఇలాంటిదే ఇంకో పద్యం

హరిదం భోరుహ లోచనల్ గగన రంగాభోగ రంగత్తమో

భర నేపధ్యము నొయ్య నొయ్య సడలింపన్ రాత్రి శైలూషికిన్

వరుసన్మౌక్తిక పట్టమున్ నిటలమున్ వక్త్రంబునున్ దోఁచె నా

హరిణాం కాకృతి వొల్చె రేకయి సగంబై బింబమై తూర్పునన్

ఒక వీధి నాటకం మొదలైంది. ఎక్కడ? చీకటి యవనిక మీద. అక్కడ రాత్రి అనబడే నటీప్రవేశం జరుగుతోంది. ఎట్లా అంటే దిక్కులనబడే స్త్రీలు (హరిదంభోరుహ లోచనలు) గగనం అనబడే వేదిక మీద చీకటి తెరలు నెమ్మదిగా లాగుతున్నారు. ముత్యాల పట్టికలాంటి నుదురొక రేకులా, తరువాత అర్ధ చంద్రికలా, చివరికి పూర్ణ ముఖం కనబడి రాత్రి రాకడను నటి ముఖంతో పోల్చుతాడు భట్టు మూర్తి.

ఈ పద్యం లోని సౌందర్యం అంతా దాని ఊహలోనే ఉంది. ఆమె ముఖం చంద్ర బింబంలా ఉందనే ఉపమలో ముఖం అనే ఉపమేయం ప్రతిభావంతుడైన కవి చేతిలో ఎట్లా ఉత్ప్రేక్షగా మారుతుందో ఇక్కడ చూస్తాం.

ఒక నటీమణి రంగప్రవేశాన్ని చంద్రోదయంతో పోల్చి పద్యానికి ఊహ ఎంత ముఖ్యమో చెబుతాడు భట్టు మూర్తి. కొంచె ఓపిక చేసుకొని చదివితే పురా కవుల కావ్య భాష నిండా ఉత్ప్రేక్షలు గుత్తులు గుత్తులుగా దొరుకుతాయి. వాటిని పట్టుకోవటం వదిలేయటం మన సారస్వత ఉద్వేగంతో ముడిపడి ఉంటుంది.

- రఘు

Tags

Next Story