అతడి లోపల

ఆమె
అతడి కోసం ఎదురు చూస్తోంది
కాల్వ ఒడ్డున చెట్టు కింద కూర్చుని
అతడు
ఇంకా రాలేదు
సాయంకాలపు గాలిలో కలిసి
సూర్యుడు మెరుస్తున్నాడు
పారే ఏరు కూడా
వందల కళ్ళతో రెప్పలు తెరిచి చూస్తోంది
చెట్టు కూడా చుట్టూ తిరిగి చూస్తోంది
అతడి జాడ కోసం
ఆమె
తన జూకాలకు వేలాడుతోంది
చూపుడు వేలికి చుట్టిన
కొంగులో నలిగిపోతోంది
ఆమె పాదాల కింద పచ్చగడ్డి
మౌనంగా తలదించుకుంది
ఆమె ఉఛ్వాస నిశ్వాసలు
సౌందర్యాన్ని రెట్టింపు చేస్తున్నాయి
ఆకాశం రాలుతోంది చెట్ల ఆకుల
సందుల్లోంచి కొద్ది కొద్దిగా
సాయంకాలపు ధూళిలోకి
చీకటి వచ్చి వాలుతోంది
ఏకాంతాన్ని మరింత దట్టంగా మార్చేస్తూ
సూర్యుడు వెళ్ళిపోయాడు ఇప్పుడు
భూమి ఆమె చుట్టూ తిరుగుతోంది
కాళ్ళ మీంచి దుప్పటిని పైకి లాక్కుంటోంది
కదిలీ కదలక పారుతున్న ఏరు
చెట్టు నిద్రపట్టని కుక్కపిల్లలా
ఆమె పక్కనే కూర్చుని చెవులాడిస్తోంది
ఆమె లోపల గుత్తులు గుత్తులుగా
విచ్చుకుంటున్నాయి నక్షత్రాలు
ఈ అద్భుతంలోకి దేహాంతర దేహాలతో
అతడు వస్తున్నాడు
ఒక్కటైన ఇద్దరి ఏకాంతం
ఒక్కటైంది గాఢంగా
పాలపుంతల ఆత్మగానాల
గాలులే ఇక నిలువెల్లా
- పసునూరు శ్రీధర్ బాబు
Tags
-
Home
-
Menu
