రాష్ట్రంలో ప్రతీ వర్గానికీ ప్రభుత్వం బాకీ పడింది : హరీశ్ రావు

రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని, ఏ వర్గానికి ఎంతెంత బాకీ పడిందనే వివరాలను చాటిచెప్పేందుకే బాకీ కార్డును తీసుకొచ్చామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో శనివారం మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ తదితరులతో కలిసి కెటిఆర్ ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీసి తమ బాకీని వసూలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్డును తెలంగాణలోని ఇంటింటికీ చేరుస్తామని చెప్పారు. కాంగ్రెస్ చేసిన మోసాలే నేడు ప్రజల చేతిలో పాశుపతాస్త్రాలుగా మారాయన్నారు. రాబోయే పంచాయతీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ది చెప్పాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని ప్రతి ఇంటి తలుపుతట్టి, కాంగ్రెస్ బాకీల బండారాన్ని ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ కార్డుకు విరుగుడే ఈ ‘బాకీ కార్డు’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన దోఖాకు బదులు తీర్చుకునే సరైన మోకా తెలంగాణ ప్రజలకు వచ్చిందన్నారు. ఏ వర్గానికి కాంగ్రెస్ ఎంత బకాయి పడ్డదో నిలదీసి నిగ్గదీసి అడగడానికే ఈ బాకీ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించామని వెల్లడించారు. రాష్ట్రస్థాయి నాయకుల నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్డును ఇంటింటికీ తీసుకెళ్తారని చెప్పారు. వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మోసపోతే గోస పడతామని ఎన్నికలకు ముందు కెసిఆర్ పదే పదే చెప్పారని, అదే ఇప్పుడు నిజమైందని కెటిఆర్ అన్నారు. మొదటి కేబినేట్ సమావేశంలోనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ గాంధీ అన్నారని గుర్తు చేశారు. ఇప్పటివరకు 30కి పైగా కేబినెట్ సమావేశాలు జరిగినా ఆ ఊసే లేదని విమర్శించారు. బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు పెట్టిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క నేడు మాట దాటవేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంధును కూడా బంద్ చేస్తారు
పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంధును కూడా బంద్ చేస్తారని కెటిఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో రైతులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు.. ఇలా అన్ని వర్గాల ప్రజల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ బాకీ కార్డు’లోని ప్రతీ అక్షరం రేవంత్ సర్కార్ మోసానికి నిలువుటద్దమని మండిపడ్డారు. ఏ వర్గాన్ని కూడా వదలకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా నిలువునా ముంచిందో ఆయన అంకెలతో సహా వివరించారు. అన్నదాతల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అడుగడుగునా దగా చేస్తున్నదని, ఎకరానికి రూ.15 వేల ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రూ.2 లక్షల రుణమాఫీ ఊసేలేదని, వరికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి చేతులెత్తేశారని అన్నారు. కౌలు రైతులు, రైతు కూలీల కన్నీళ్లను పట్టించుకునే నాథుడే లేరని, వారికి ఇస్తామన్న రూ.15 వేలు, రూ.12,000 ఏ గంగలో కలిపారని అడిగారు. ఇవన్నీ బాకీ కాదా...? అని నిలదీశారు. 2 లక్షల ఉద్యోగాల హామీ బాకీ, నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, 22 నెలలుగా ప్రతి నిరుద్యోగికి వేలల్లో బాకీ పడిందని, ఈ మోసానికి కాంగ్రెస్ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.
మహాలక్ష్మి పథకం పేరుతో ఆడబిడ్డలను ఇంత దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి, ఒక్కో మహిళకు దాదాపు రూ.55,000 బాకీ పెట్టారని, ఈ ప్రభుత్వం వచ్చాక పెళ్లైన 8 లక్షల మంది ఆడబిడ్డలకు 8 లక్షల తులాల బంగారం బాకీ పండిందని అన్నారు. వృద్ధులు, వితంతువుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగలకుండా పోదని పేర్కొన్నారు. నెలకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని చెప్పి, 22 నెలలుగా ఒక్కొక్కరికి రూ.44 వేలు బాకీ పడ్డారని, దివ్యాంగులకు నెలకు రూ.6 వేలు ఇస్తామని హామీ ఇచ్చి, కెసిఆర్ పెంచిన రూ.4 వేలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ఒక్కో దివ్యాంగుడికి రూ.44 వేలు బాకీ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు బాకీ, తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులకు 250 గజాల స్థలం ప్రభుత్వం బాకీ పడిందని, విద్యార్థినులకు స్కూటీలు, యువతకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు, ఆటో అన్నలకు రూ.24 వేలు బాకీ అని, గృహజ్యోతి పథకం కూడా సరిగా అమలు కావడం లేదని విమర్శించారు. ఈ మోసాలన్నింటినీ ప్రజల ముందు ఎండగడతామని స్పష్టం చేశారు.
ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు
ప్రజల తరఫున గొంతు విప్పుతున్న తమపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కెటిఆర్ మండిపడ్డారు. తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత వేధించినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఓవైపు న్యాయపరంగా పోరాడుతూనే, మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ నయవంచనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో ఈ బాకీ కార్డులను ముద్రించామని, తెలంగాణ ప్రజలను జాగృతం చేసే ఈ ప్రచారానికి మీడియా కూడా సహకరించాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.
రేవంత్ రెడ్డి కటింగ్ మాస్టర్ : హరీష్‌రావు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి హరీష్‌రావు హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క బాండు పేపర్‌పై సంతకాలు పెట్టి ఎన్నికల హామీలు ఇచ్చారని.. కానీ ఎన్నికల హామీలపై ఇప్పడెందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ బకాయి కార్డులను ఇంటింటికీ పంచుతామని చెప్పారు. బాకీ కార్డు చూపించి ప్రజలు కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ప్రభుత్వ ఉద్యోగులు, ఆటో కార్మికులు, వ్యవసాయ కార్మికులు సైతం మోసపోయారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి.. ఎన్నికల ముందు రజనీకాంత్.. ఎన్నికల తర్వాత గజినీకాంత్ మాదిరిగా మారిపోయారని ఎద్దేవా చేశారు. రేవంత్.. చీఫ్ మినిస్టర్ కాదు.. రేవంత్ రెడ్డి కటింగ్ మాస్టర్ అని సెటైర్లు గుప్పించారు. కెసిఆర్ కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్ కటింగ్ చేసే పనిలో రేవంత్‌రెడ్డి బిజీగా ఉన్నారని ఆక్షేపించారు. ఆరు గ్యారెంటీలపై తెలంగాణ అసెంబ్లీలో చర్చిదామంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పారిపోయారని విమర్శించారు. మార్పు మార్పు అంటూ ప్రజలను రేవంత్‌రెడ్డి ఏమార్చారని మండిపడ్డారు. ఎన్నికల ముందు గల్లీ గల్లీ తిరిగిన గాంధీలు.. ఇప్పుడు ఎక్కడ..? అని నిలదీశారు. ప్రజలు ప్రశ్నిస్తారని గాంధీలు హైదరాబాద్‌కు రాకుండా ముఖం చాటేశారని ఆరోపించారు.
-
Home
-
Menu