మూసీ మహోగ్రం

మూసీ మహోగ్రం
X
గ్రేటర్ హైదరాబాద్ నగరంపై ప్రకృతి కన్నెర్రచేసింది. ఓవైపు భారీ వర్షాలు.. మరోవైపు మూసీనది వరదలు.. మహానగరాన్ని వణికించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను కంటిమీద కునుకుల

మనతెలంగాణ సిటీ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ నగరంపై ప్రకృతి కన్నెర్రచేసింది. ఓవైపు భారీ వర్షాలు.. మరోవైపు మూసీనది వరదలు.. మహానగరాన్ని వణికించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేశాయి. వేల మందిని పునరావాస కేంద్రాలకు తలదాచుకునేందుకు కారణమయ్యాయి. మూసీనది వదరలతో అక్కడి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నదిపై ఉన్న పలు బ్రిడ్జీలపై నుండి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఎంజీబిఎస్ నుండి పూర్తిగా వరదనీరు నిండిపోయింది. బస్సులు బస్‌డిఫోలకే పరిమితమయ్యేలా మూసీవరద చేసింది. అయితే, మూసీనదీ వెడల్పు 700 అడుగులుగానే కనిపిస్తుంది. కానీ, వరదలు వస్తే మాత్రం కిలోమీటర్ మేర విస్తరిస్తున్నది. ఫలితంగా నదీ వెంటుండే బస్తీలు నీట మునుగుతున్నాయి. మహానగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో చారిత్రక మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. దాదాపు మూడు దశాబ్దాలలో ఎన్నడూ చూడని విధంగా తీర ప్రాంతాలను మూసీనది ముంచెత్తింది. నదీ వెంబడి ఉన్న లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 1000 మందికిపైగా ప్రజలను తాత్కాలిక పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు.

నదిలోకి 14,000 క్యూసెక్కుల నీరు..

హైదరాబాద్ శివారులోని జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ (గండిపేట)ల 17 గేట్లను తెరవడంతో 14,000 క్యూసెక్కుల నీరు మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్ 6 గేట్లు ఎత్తి 6,000 క్యూసెక్కుల నీటిని మూసీనదిలో చేరుతుంది. ఉస్మాన్‌సాగర్ 11 గేట్లు ఎత్తి 8,000 క్యూసెక్కుల నీరు మూసీనదిలోకి వదులుతున్నారు. ఈ 14 వేల క్యూసెక్కుల నీటితో పాటు భారీ వర్షాలతో నగరంలోని వరదనీరంతా మూసీలోకి చేరుతుంది. దీంతో వరద ప్రవాహం ప్రమాదకరంగా మారింది. నగరంలోని పురానాపూల్ శివాలయంలో వరద నీటిన చిక్కుకుపోయిన నలుగురు ఆలయ సిబ్బందిని హైడ్రా డీఆర్‌ఎఫ్ సిబ్బంది కాపాడింది. శివాలయంపైనే పూజారి కుటుంబం ఉండిపోగా, వారికి టిఫిన్స్, భోజనాలు అందించారు. మూసీ వరద ఉధృతికి మహత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) పూర్తిగా నీట మునిగింది. పురానాపూల్ వంతెన వద్ద 13 అడుగులమేర ప్రమాదకరంగా మూసీ ప్రవహిస్తోంది. చాదర్‌ఘాట్‌లోని లెవల్ వంతెన, మూసారాంబాగ్ వంతెనపై నుంచి కొన్ని అడుగుల మేర వరద నీరు ప్రవాహించింది. దీంతో అధికారులు ముందుగానే ఆ వంతెనల పై నుంచి రాకపోకలను నిలిపివేశారు. మూసారాంబాగ్ బ్రిడ్జి పక్కనే నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జిని సైతం వరద ముంచెత్తడంతో నిర్మాణ సామాగ్రి కొట్టుకుపోయింది. చాదర్‌ఘాట్ వంతెన వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చిన్న బ్రిడ్జి మూసివేయడంతో, పెద్ద బ్రిడ్జి పైనుంచి వాహనాలు రాకపోకలు కొనసాగించాయి. అంబర్‌పేట్, - దిల్‌సుఖ్‌నగర్ రహదారి పూర్తిగా మూసివేశారు.

నీటమునిగిన ఎంజీబిఎస్..

శుక్రవారం అర్ధరాత్రి వేళ మూసీ వరదనీరు ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి చేరడంతో బస్సుల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఎంజీబీఎస్ బస్ స్టేషన్‌కు వెళ్లే రెండు ప్రధాన బ్రిడ్జిలు నీట మునిగాయి. వరద ఎంజీబీఎస్‌లోకి చేరిన తక్షణమే, డీఆర్‌ఎఫ్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన స్పందించారు.

డిఆర్‌ఎఫ్ సిబ్బంది తాళ్ల సాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా, ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే బస్సులను నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి మళ్లించారు.

పునరావాస కేంద్రాల్లో నిర్వసితుల తరలింపు

మూసీనది వరద ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, పునరావాస కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. శంకర్‌నగర్ ప్రాంతంలోని దాదాపు 500 మంది నిర్వాసితులు షాజాదీ మసీదులో వసతి పొందుతున్నారు. మలక్‌పేట్ సర్కిల్‌లోని మూసానగర్ కమ్యూనిటీ హాల్‌లో 150 మంది వసతి పొందుతున్నారు. దుర్గా నగర్, అంబేద్కర్ నగర్ నిర్వాసితులు (దాదాపు 45 కుటుంబాలు) మూసారాంబాగ్ వంతెనకు సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వసతి పొందుతున్నారు.

అంబేద్కర్ నగర్ బస్తీలోనీ ఇళ్లలోకి వరద నీరు రావడంతో జనాలు బయటకు వెళ్లి ఎత్తైన ప్రదేశంలో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో చూస్తున్నారు. కృష్ణనగర్ కమ్యూనిటీ హాల్‌కు 32 మందిని తరలించి ఆహారపదార్థాలు అందిస్తున్నారు. భూలక్ష్మీ ఆలయం నుంచి 55 మందిని గోడే-కి-ఖబర్ కమ్యూనిటీహాల్‌కు తరలించారు. నార్సింగి మంచిరేవుల మధ్య సర్వీసు రోడ్డుపై వరద పారింది. బారికేడ్లు పెట్టినా పట్టించుకోకుండా ఆటో ట్రాలీలో రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన డ్రైవర్, అందులోని నలుగురిని హైడ్రా డిఆర్‌ఎప్ బృందాలు రాత్రివేళ సురక్షితంగా కాపాడాయి.

Tags

Next Story