మూసికి పోటెత్తిన వరద

మూసికి పోటెత్తిన వరద
X
రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పలు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు పడిపోవడంతో రహదారు

మూసికి పోటెత్తిన వరద

ప్రమాద స్థాయికి చేరుకున్న ప్రవాహం

మూసి పరివాహక ప్రాంతంలో నీట మునిగిన ఇళ్లు

వరద ప్రవాహంతో చాదర్‌ఘాట్ చిన్న బ్రిడ్జి మూసివేత

మూసానగర్, శంకర్ నగర్‌లో వంద ఇళ్లలోకి చేరిన వరద నీరు

నిండుకుండలా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్

అన్ని గేట్లు ఎత్తడంతో దిగువకు నీరు

రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో ఎడతెగని వాన

వేల ఎకరాల్లో పంట నష్టం

ఓఆర్‌ఆర్ మంచిరేవుల సర్వీస్ రోడ్డుపైకి చేరిన వరద ప్రవాహం

జయశంకర్ భూపాల్లి జిల్లా మహాదేవ్ పూర్‌లో ఇంటి గోడ కూలి మహిళ మృతి

సంగారెడ్డిలో ఇస్నాపూర్, రుద్రారం జాతీయ రహదారిపై చేరిన వరద నీరు

రంగారెడ్డిలో గుర్రంపల్లి వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి

రాజన్న సిరిసిల్లలో పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి

వాయుగుడంగా మారనున్న అల్పపీడనం

రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పలు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు పడిపోవడంతో రహదారులపై ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్‌లో కురిసిన వర్షాలకు మూసి నది ఉగ్రరూపం దాల్చి, వరద నీటితో ఉదృతంగా ప్రవహిస్తుంది. ఫలితంగా మూసి పరివాహక ప్రాంతంలో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూసరాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద ప్రవాహం ఉదృతంగా ప్రవహిస్తుండటంతో బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. జంట జలాశయాలయిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. క్రమంగా వరద నీరు పెరగడంతో జలాశయాల గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ఓఆర్‌ఆర్ మంచిరేవుల, నార్సింగ్ వద్ద సర్వీస్ రహదారిపై నీరు పొటెత్తడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. పురానాపూల్, చాదర్‌ఘాట్ నీటి ప్రవాహానికి చాదర్‌ఘాట్ చిన్నబ్రిడ్జిపై నీటి ప్రవాహం చేరడంతో అధికారులు ఈ చిన్నబ్రిడ్జిని మూసివేశారు.

మూసి పరివాహక ప్రాంతమైన మూసానగర్, శంకర్‌నగర్‌లో సుమారు వంద ఇళ్లలోని నీరు చేరడంతో ప్రజలు ఆందోళన చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెగని వర్షాలకు నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వేల ఎకరాలు పంట నీట మునిగింది. నిర్మల్ జిల్లాలో కురిన వర్షాలకు సుమారు ఆరు వేల ఎకరాల్లో పత్తి, సోయాబీన్, వరి పంటలు దెబ్బతిన్నాయి. జయశంకర్ భూపాలిపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం బెంగుళూరు గ్రామంలో ఇంటి గోడ కూలడంతో మంద లక్ష్మి అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఆమె భర్త దుర్గయ్యకు గాయలు కావడంతో మహదేవ్‌పూర్ ప్రభుత్వ ఆస్పుత్రికి తరలించారు.

రంగారెడ్డి జిల్లా గుర్రంపల్లి గ్రామానికి చెందిన ఎన్కెపల్లి సత్తయ్య అనే వ్యక్తి గుర్రంపల్లి వాగు దాటేందుకు ప్రయత్నించగా వరద ప్రవహంలో కొట్టుకుపోయాడు. కొద్దిసేపటి తరువాత పంట పొలాల పక్కన మృతదేహం లభ్యమయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామానికి చెందిన పరుశురాం అనే వ్యక్తికి చెందిన రెండు ఆవులు మేతకు వెళ్లిన క్రమంలో పిడుగుపాటుకు గురై మృత్యువాతపడ్డాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం 15 గేట్లు ఎత్తి 20, 758 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న గోదావరికి విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరికి ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తుండటంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. శుక్రవారం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురువడంతో స్థానిక మార్కెట్‌లోకి వర్షపునీరు చేరి కూరగాయల దుఖాణాలు నీట మునిగాయి. ఇస్నాపూర్ రుద్రారం వద్ద జాతీయ రహదారిపై నీరు నిలిచింది.

సింగూర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 85 వేల క్యూసెక్కుల వరదనీరు చేరడంతో 90 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పరివాహక ప్రాంత ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలకు ల్యాండింగ్‌కు అనుమతి లభించలేదు. ఎయిర్ పోర్ట్ అల్లకల్లోల వాతావరణం ఉండడంతో పుణే, హైదరాబాద్ విమానాలతో పాటు పలు విమానాలను విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు దారి మళ్ళించారు. వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో నగసముందర్ వెళ్లే రహదారిపై నీరు ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చింతకుంట, నాగారం, మైలారం ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకావశం ఉందని, ఈ వాయుగుండం శనివారం తీరం దాటే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం తెలంగాణ మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య కొనసాగుతుందని తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

Tags

Next Story