మూసీ ముంచెత్తడం వెనక రేవంత్ కుట్ర

మనతెలంగాణ/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 1,50,000 కోట్ల దోపిడీ కోసమే హైదరాబాద్ ప్రజలను మూసీ వరదలో ముంచారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు కోసమే సిఎం కిరాతకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వరద హెచ్చరికలు ఉన్నా జలాశయాల నుంచి నీరు విడుదల చేయలేదని, ఉద్దేశ పూర్వకంగానే జంట జలాశయాల నుంచి నీరు వదల్లేదని ఆక్షేపించారు. మూసీ ప్రాంత వాసులను భయపెట్టేందుకే ఒకేసారి 15 గేట్లు తెరిచారని విమర్శించారు. ఎన్నడూ లేనిది ఇప్పుడే ఎంజీ బస్టాండ్ ఎందుకు మునిగిందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కిరాతక మనస్తత్వంతోనే వేలాది ప్రజల ఇండ్లు, ఆస్తులు మూసీ వరదలో చిక్కుకున్నాయని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో శనివారం కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బిజెపి నాయకులు బిఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కెటిఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, సిఎం రేవంత్‌రెడ్డి పథకం ప్రకారమే ఎంజిబిఎస్‌ను ముంచారని ఆరోపించారు. హైదరాబాద్‌కు వరద ముప్పును తగ్గించేందుకు వందేళ్ల కిందట నిజాం ప్రభుత్వం నిర్మించిన ఉస్మాన్ సాగర్, గండిపేట చెరువులను వాతావరణ శాఖ హెచ్చరికలు రాగానే ఖాళీ చేసి మూసీ వరద నీటిని నిల్వ చేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు. కానీ, మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో దోపిడీకి పాల్పడేందుకు ఆ ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయాలన్న దురుద్దేశంతో రేవంత్ రెడ్డి ఆ చెరువులను ఖాళీ చేయించలేదని ఆరోపించారు. అందుకే చరిత్రలో తొలిసారిగా ఇమ్లిబన్ బస్టాండ్‌ను వరద ముంచెత్తిందన్నారు.
వచ్చే ఎన్నికల్లో రేవంత్ కొడంగల్ నుంచి పోటీ చేయరు
వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేయరని కెటిఆర్ ఆరోపించారు. సొంత నియోజకవర్గ ప్రజలు రేవంత్ రెడ్డిపై రగిలిపోతున్నారన్నారు. కాంగ్రెస్‌ను బొంద పెట్టడానికి స్థానిక సంస్థల ఎన్నికలు మంచి అవకాశమని వెల్లడించారు. కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బిఆర్‌ఎస్ గెలవాలని పిలుపునిచ్చారు. అనుముల బ్రదర్స్ అరాచకాలపై ఆగ్రహంగా ఉన్న కొడంగల్ ప్రజలు ఎలాగైనా రేవంత్ రెడ్డిని ఓడించాలని కంకణం కట్టుకుని ఉన్నారని అన్నారు. కొడంగల్‌లో వస్తున్న వ్యతిరేకతను గుర్తించిన రేవంత్ రెడ్డి, రాబోయే ఎన్నికల్లో వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్రానికి సిఎం రేవంత్ అయినా కొడంగల్‌కు మాత్రం ఆయన సోదరుడు తిరుపతి రెడ్డియే ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. కనీసం కౌన్సిలర్ కూడా కాని తిరుపతి రెడ్డికి కలెక్టర్లు, ఎస్పీలు వంగి దండాలు పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి మూడేళ్లు ఎదురుచూడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కొడంగల్‌లో స్విచ్ బంద్ చేస్తే ఢిల్లీలో లైట్లు బంద్ అవుతాయని చెప్పారు.
-
Home
-
Menu