సిఎం వేధింపులతోనే ఎల్ అండ్ టి నిష్క్రమణ

ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మాయని మచ్చ
250 ఎకరాల మెట్రో భూములపై సిఎం
రేవంత్‌రెడ్డి కన్నుపడింది మెట్రోను రాష్ట్ర
ప్రభుత్వం తీసుకోవడంపై కేంద్రం విచారణ
జరపాలి పెట్టుబడిదారులను సాక్షాత్తూ
ముఖ్యమంత్రే బెదిరిస్తున్నారు నా అరెస్టు
కోసం కాంగ్రెస్ నేతలు కళ్లు కాయలు కాసేలా
ఎదురు చూస్తున్నారు నేను ఏ తప్పు
చేయలేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్ అండ్ టి నిష్క్రమణ రాష్ట్ర ప్రభుత్వానికి మాయని మచ్చ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్ష సాధింపు, అహంకారపూరిత, నియంతృత్వ పోకడల కారణంగానే ఎల్‌అండ్‌టి కంపెనీ మెట్రో నుంచి అర్ధాంతరంగా వైదొలగిందని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ బాధ్యతారాహిత్య, అనాలోచిత నిర్ణయంతో రాష్ట్ర ప్రజలపై ఒక్కరోజే ఏకంగా రూ.15 వేల కోట్ల అప్పుల భారం పడిందని విమర్శించారు. మేడిగడ్డ విషయంలో బిఆర్‌ఎస్‌ను బద్నాం చేసే అవకాశం ఇవ్వకుండా, తామే మరమ్మతులు చేస్తామని ఎల్ అండ్ టి ముందుకురావడమే రేవంత్ రెడ్డికి కంటగింపుగా మారిందని పేర్కొన్నారు. అప్పటి నుంచే ఆ సంస్థపై కక్షగట్టి వేధించి, రాష్ట్రం విడిచి వెళ్ళిపోయేలా చేశారని మండిపడ్డారు. సిఎం కక్ష సాధింపు చర్యలు భరించలేకే 2070 వరకు లీజు ఉన్న ఎల్ అం టి సంస్థ రాష్ట్రం నుంచి వాకౌట్ చేసిందని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపి వద్దిరాజు రవిచంద్ర, బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తమ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ మెట్రోకు మంచి డిమాండ్ ఉండేదని, తాము దిగిపోయే నాటికి దేశంలోనే రెండో అతిపెద్ద వ్యవస్థగా ఉందని అన్నారు. ఎల్‌అండ్‌టికి ప్రభుత్వం కేటాయించిన 280 ఎకరాల విలువైన భూములపై సిఎం రేవంత్ రెడ్డి కన్ను పడిందని ఆరోపించారు.
ఆ భూములను అడ్డగోలుగా అమ్మకోవడానికి లేదా తమ అనుయాయులకు చెందిన సంస్థలకు కట్టబెట్టడానికే ఈ కుట్ర పన్నారని పేర్కొన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హైదరాబాద్ మె ట్రో నుంచి ఎల్‌అండ్‌టి కంపెనీ నిష్క్రమించడంతో ఆ కంపెనీ షేర్ విలువ 3 శాతం పెరిగింది తెలిపా రు. ఓఆర్‌ఆర్ చుట్టూ 160 కి.మీ., భువనగిరి, సంగారెడ్డి, షాద్‌నగర్, కడ్తాల్ వరకు దశలవారీగా మెట్రో విస్తరణకు గతంలో కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. అత్యంత కీలకమైన మైండ్‌స్పేస్ -శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు టెండర్లు పూర్తిచేసి శంకుస్థాపన కూడా చేశామని అన్నారు. భూసేకరణ అవసరం లేకుండా, పిల్లర్లు లేకుండా భూమ్మీదనే నిర్మించేలా దానిని డిజైన్ చేశామని వివరించారు. కానీ, రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆనాలోచితంగా ఎయిర్‌పోర్ట్ మెట్రో రద్దు చేశారని మండిపడ్డారు. అప్పటి నుంచే సిఎంకు, ఎల్‌అండ్‌టికి మధ్య పంచాయితీ మొదలైందని అన్నారు.
కార్ల విషయంలో తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చు
తన అరెస్టు కోసం కాంగ్రెస్ నేతలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారని కెటిఆర్ ఎద్దేవా చేశారు. తనను ఎప్పుడైనా అరెస్టు చేసుకోవచ్చని, తనకు అరెస్టు భయం లేదని స్పష్టం చేశారు. తాను పదేళ్లు మంత్రిగా చేశానని, లై డిటెక్టర్ టెస్టుకు కూడా సిద్ధమని చెప్పారని గుర్తు చేశారు. తాను ఏ తప్పు చేయలేదని.. ఏం చేసుకుంటారో చేసుకోవాలని అన్నారు. తనపై ఎసిబి కేసు ఉందని... రేవంత్‌రెడ్డిపై కూడా ఎసిబి కేసుందని, తనతో పాటు రేవంత్‌రెడ్డి లై డిటెక్టర్ టెస్ట్‌కు రావాలని సవాల్ విసిరారు. కార్ల విషయంలో తాను తప్పు చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని అన్నారు.
హైడ్రా పెద్దలకు చుట్టం.. పేదలకు భూతం
కాంగ్రెస్ పాలనలో హైడ్రా అనే భూతంతో రియల్ ఎస్టేట్‌ను దెబ్బతీశారని మండిపడ్డారు. పెద్దల ఇండ్ల జోలికి వెళ్లని హైడ్రా పేదల ఇండ్లపై మాత్రం తన ప్రతాపం చూపిస్తుందని విమర్శించారు. హైడ్రా పెద్దలకు చుట్టం.. పేదలకు భూతమని ధ్వజమెత్తారు. మంత్రి వివేక్, కాంగ్రెస్ నేతలు కెవిపి రామచంద్రరావు, తిరుపతి రెడ్డిల్ ఇళ్లను హైడ్రా ఎందుకు కూల్చదని ప్రశ్నించారు.
-
Home
-
Menu
